'ఛత్రపతి'లా పవన్ కల్యాణ్... వర్షంలోనూ జనసేనాని రోడ్ షోకు భారీ స్పందన

04-12-2020 Fri 16:04
  • తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పవన్ పర్యటన
  • చిత్తూరు జిల్లా పోయ గ్రామంలో ప్రసంగం
  • వైసీపీ నేతలపై ఆగ్రహం
Pawan Kalyan visits Poya village of Srikalahasti constituency

జనసేనాని పవన్ కల్యాణ్ తుపాను ప్రభావిత చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ఆయన శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని పోయ గ్రామంలో పర్యటించారు. పవన్ వచ్చిన సమయంలో భారీ వర్షం కురిసినా జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఛత్రపతి సినిమాలో గొడుగు వేసుకున్న హీరోలా పవన్... తమ సేనాని చెప్పేది వినేందుకు వర్షాన్ని లెక్కచేయకుండా నిలిచిన ప్రజలతో పోయ గ్రామంలో ఆసక్తికరమైన దృశ్యాలు కనిపించాయి.

ఈ సందర్భంగా పవన్ ఆవేశపూరిత ప్రసంగంతో పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. పోయ గ్రామంలోకి రానివ్వకుండా తనను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బెదిరింపులకు భయపడే వ్యక్తిని కానని స్పష్టం చేశారు. జనసేన కార్యకర్తలపై దాడులు చేస్తే ప్రతిచర్యలు అంతకంటే తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

మాపై దాడి చేస్తారా... ప్రతిదాడి కావాలనుకుంటే అందుకు జనసైనికులు సిద్ధం అని తమ వైఖరి వెల్లడించారు. తాము వచ్చింది రైతు సమస్యలపై పోరాటం చేయడానికని, తమను అడ్డుకుంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.