పోలైన ఓట్ల కంటే బాక్సులో ఎక్కువ ఓట్లు.. పలు చోట్ల బీజేపీ నేతల ఆందోళన

04-12-2020 Fri 13:31
  • వివేకానందనగర్‌ కౌంటింగ్‌ కేంద్రంలో గందరగోళం
  • అధికారుల తీరుపై బీజేపీ నేతల మండిపాటు
  • ఆ డివిజన్‌లో మొత్తం 355 ఓట్లు పోలయ్యాయని ఇటీవల ప్రకటన
  • బాక్సుల్లో మాత్రం 574 ఉన్నాయంటోన్న అధికారులు  
bjp protest against counting in ghmc Elections

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. కొన్ని చోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. వివేకానందనగర్‌ కౌంటింగ్‌ కేంద్రంలో అధికారుల తీరుపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆ డివిజన్‌లో మొత్తం 355 ఓట్లు పోలైతే 574 ఉన్నాయని అధికారులు చెప్పారు. దీంతో పోలైన ఓట్ల కంటే బాక్సుల్లో ఎక్కువ ఓట్లు ఉండడం పట్ల బీజేపీ నేతలు అభ్యంతరాలు తెలుపుతున్నారు. వివేకానంద నగర్ బూత్ నంబర్ 76 బాక్స్‌లకు సీల్ లేదంటూ బీజేపీ ఏజెంట్లు కౌంటింగ్‌ను అడ్డుకున్నారు.

ఈ విషయంపై ఇప్పటికే రిటర్నింగ్ అధికారి సునీతకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆమె తమ అభ్యంతరాన్ని లెక్కలోకి తీసుకోలేదని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. మరోవైపు గోషామహల్ నియోజకవర్గంలోనూ ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. జాంబాగ్ డివిజన్‌లోని బూత్ నెంబర్ 8లో పోలైన ఓట్ల కంటే బాక్స్ లో ఉన్న ఓట్లు అధికమని తేలింది. అయితే, పోలింగ్ శాతమే తప్పుగా ప్రకటించారని అధికారులు చెబుతున్నారు.