అమెరికాలో కరోనా కట్టడికి తీసుకోనున్న తొలి చర్యను ప్రకటించిన జో బైడెన్!

04-12-2020 Fri 13:24
  • 100 రోజుల పాటు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి
  • అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోయే జనవరి 20నే ప్రజలను కోరతా
  • 100 రోజుల్లో కొత్త కరోనా‌ కేసులు గణనీయంగా తగ్గిపోతాయి
joe biden announces his plan about halt corona

డెమొక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్ వచ్చేనెల 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. అమెరికాను వణికిస్తోన్న కరోనా కేసులను కట్టడి చేయడానికి ఇప్పటికే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, వారి నుంచి సలహాలు తీసుకుంటోన్న బైడెన్.. తాను చేపట్టనున్న చర్యల గురించి వివరించారు.

మొదట అమెరికా ప్రజలందరినీ 100 రోజుల పాటు తప్పనిసరిగా మాస్క్‌ ధరించమని కోరతానని అన్నారు. ఇదే ఆయన తీసుకోనున్న తొలి చర్యగా తెలుస్తోంది. ట్రంప్‌ ప్రభుత్వం మాత్రం ఈ విధానానికి పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. మాస్క్‌ ధరించడానికి ఉన్న ప్రాధాన్యతను గురించి జో బైడెన్  పునరుద్ఘాటించారు.

అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోయే జనవరి 20నే 100 రోజుల పాటు తప్పనిసరిగా మాస్క్‌ ధరించమని అమెరికా ప్రజలను కోరతానని, ఎప్పటికీ ధరించాలని మాత్రం చెప్పనని అన్నారు. కేవలం 100 రోజుల్లో కొత్త కరోనా‌ కేసులు గణనీయంగా తగ్గిపోతాయని చెప్పారు.

2.75 లక్షల మంది అమెరికన్ల మృతికి కారణమైన కరోనాను నిలువరించడంలో సులభమైన మార్గాలలో ఇదొకటి అని ప్రజారోగ్య నిపుణులు చెబుతున్నారని గుర్తు చేశారు. అయితే, దీనిని స్వీకరించడానికి చాలా మంది సుముఖంగా లేకపోవడం చాలా నిరాశపరుస్తోందని చెప్పారు.