కాసేపట్లో పోయ గ్రామానికి పవన్ కల్యాణ్.. జనసేన నేతలను అడ్డుకున్న వైసీపీ నేతలు.. ఉద్రిక్తత

04-12-2020 Fri 13:09
  • తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధ్యక్షుడి పర్యటన
  • పవన్  తమ గ్రామంలోకి రావడానికి వీల్లేదంటోన్న వైసీపీ నేతలు
  • అప్రమత్తమైన పోలీసులు
ruckus in poya village

ఆంధ్రప్రదేశ్‌లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మూడు రోజులుగా పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల జనసేన నేతలు, కార్యకర్తలతోనూ ఆయన చర్చలు జరుపుతున్నారు. ఈ రోజు ఆయన  చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని పోయ గ్రామంలో పర్యటించాల్సి ఉంది. అయితే, అక్కడ పవన్‌ కల్యాణ్ పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించడంతో అలజడి రేగుతోంది.

జనసేనాని‌ తమ గ్రామంలోకి రావడానికి వీల్లేదంటూ అక్కడి వైసీపీ నేతలు.. జనసేన నాయకులను అడ్డుకున్నారు. తొట్టంబేడు మండలం వైసీపీ అధ్యక్షుడు వాసుదేవ నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు ఈ చర్యకు పాల్పడ్డారు. షెడ్యూల్ ప్రకారం కాసేపట్లో పవన్‌ కల్యాణ్ ఆ గ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.