ప్రభాస్ కొత్త సినిమా 'సలార్'కి అర్థం వివరించిన దర్శకుడు ప్రశాంత్ నీల్

04-12-2020 Fri 12:48
  • 'కేజీఎఫ్'తో పేరుతెచ్చుకున్న ప్రశాంత్ నీల్ 
  • 'సలార్' చిత్రనిర్మాణానికి సన్నాహాలు
  • చీఫ్ కమాండర్ అని అర్థం చెప్పిన ప్రశాంత్
  • కథకు తగ్గా హీరో అన్న దర్శకుడు    
Prashanth Neil clarifies the meaning of Salar

పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం 'సలార్'. ఆమధ్య వచ్చిన 'కేజీఎఫ్' చిత్రంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. దీనికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే, ఎప్పుడూ వినని 'సలార్' అనే పదానికి అర్థం ఏమిటో తెలియక చాలామంది తికమకపడుతున్నారు. దాంతో ఎవరికి తోచిన అర్థాన్ని వారు ఇచ్చుకుంటున్నారు.

ఈ క్రమంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ దీనిపై స్పందించాడు. "అవును.. సలార్ అన్న పదానికి ఎంతోమంది ఎన్నో రకాల అర్థాలు ఇస్తున్నారు. అయితే, అది ఒక ఉర్దూ పదం.. ఆ భాషలో సలార్ అంటే చీఫ్ కమాండర్ అని అర్థం. రాజుకి కుడిభుజం వంటి వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. ఉర్దూలో ఇది చాలా వాడుక పదం" అని చెప్పారు.

ఇక ఎంతోమంది హీరోలుండగా ఈ పాత్రకు ప్రభాస్ నే తీసుకోవడానికి కూడా ఆయన కారణం చెప్పారు. "కన్నడ హీరోలను కాకుండా ప్రభాస్ ని హీరోగా ఎందుకు తీసుకున్నావని నన్ను చాలా మంది అడుగుతున్నారు. సలార్ కథకి ప్రభాస్ సరిగ్గా సరిపోతాడని నాకు అనిపించింది. అందుకే, ఆయనను ఎంచుకున్నాను" అన్నారు ప్రశాంత్.