Kollu Ravindra: మంత్రి పేర్నినానిపై దాడి కేసులో కొల్లు రవీంద్ర ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఉద్రిక్తత

ruckus at kollu ravindra home
  • మచిలీపట్నంలో పేర్ని నానిపై ఇటీవల ఓ వ్యక్తి దాడికి యత్నం
  • ఆధారాలు ఏమైనా ఉంటే తెలియజేయాలని రవీంద్రను కోరిన పోలీసులు
  • పోలీసు స్టేషన్‌కు ఎందుకు రావాలని కొల్లు రవీంద్ర నిలదీత
  • రవీంద్ర ఇంటికి భారీగా వచ్చిన టీడీపీ కార్యకర్తలు
మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానిపై ఇటీవల ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించి కలకలం రేపిన విషయం తెలిసిందే. పేర్ని నాని ఇంటి వద్ద ఆయనపై నిందితుడు తాపీతో దాడికి యత్నించాడు. అతడిని పట్టుకున్న పేర్ని నాని అనుచరులు పోలీసులకు అప్పగించారు.  

అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు నాయకులను పోలీసులు విచారించారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసు స్టేషన్‌కు తరలించి, ప్రశ్నించేందుకు పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో మచిలీపట్నంలోని ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

ఈ దాడికి సంబంధించి ఆధారాలు ఏమైనా ఉంటే తెలియజేయాలని, అలాగే కొల్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించి చేసిన ఆరోపణలకు సంబంధించి కూడా ఆధారాలు ఇవ్వాలని ఆయనకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. లిఖిత పూర్వక వివరణను నమోదు చేసుకున్నాక పోలీసు స్టేషన్‌కు ఎందుకు రావాలని కొల్లు రవీంద్ర పోలీసులను ప్రశ్నించారు. ఈ కేసుతో సంబంధం లేని తనను విచారించేందుకు స్టేషన్‌కు రమ్మనడం ఏంటని అంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు కొల్లు రవీంద్ర ఇంటికి పెద్ద సంఖ్యలో రావడం అలజడి రేపుతోంది.
Kollu Ravindra
Telugudesam
Perni Nani
YSRCP

More Telugu News