తూ.గో జిల్లాలో కారు ప్రమాదం.. కారు చెరువులోకి దూసుకెళ్లి ముగ్గురి మృతి

04-12-2020 Fri 11:44
  • కె.గంగవరం మండలం కోటిపల్లి కోట గ్రామంలో ఘటన
  • రిటైర్డ్ టీచర్  ప్రసాదరావు, ఆయన భార్య విజయలక్ష్మి, కుమారుడి మృతి
  • నిశ్చితార్థం ముగించుకొని ఏటిగట్టు రహదారిపై వెళ్తుండగా ప్రమాదం
accident in east godavari

తూర్పుగోదావరి జిల్లాలోని కె.గంగవరం మండలం కోటిపల్లి కోట గ్రామంలో కారు ప్రమాదం చోటు చేసుకుంది. యానాంకు చెందిన రిటైర్డ్ టీచర్ ప్రసాదరావు, ఆయన భార్య విజయలక్ష్మి, కుమారుడు సంతోష్‌ చంద్ర ప్రణీత్ కారులో వెళ్తోన్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పడంతో అది చెరువులోకి దూసుకెళ్లి ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు.

బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్న సంతోష్ చంద్ర ప్రణీత్ నిశ్చితార్థం ముగించుకొని ఏటిగట్టు రహదారిపై వారు ముగ్గురు యానాంకు బయలు దేరగా మార్గ మధ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోటిపల్లి కోట గ్రామం వద్దకు రాగానే వారి కారు అదుపు తప్పి గోదావరి ఏటి గట్టు రహదారి పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది.

గత అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ కారును ఆ సమయంలో స్థానికులెవ్వరూ గుర్తించలేదు. ఆ చెరువు అంతగా లోతు లేకపోయినప్పటికీ ఆ కారు డోర్లు తెరుచుకోకపోవడంతో ఊపిరాడక వారు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.