తమిళనాడు ఎన్నికల్లో రజనీకాంత్, శశికళ మధ్యే అసలైన పోటీ: సుబ్రహ్మణ్యస్వామి

03-12-2020 Thu 22:04
  • రాజకీయాల్లోకి వస్తున్నట్టు రజనీకాంత్ ప్రకటన
  • వస్తాడా, రాడా అనే చర్చ ముగిసిందన్న సుబ్రహ్మణ్యస్వామి
  • డైలమాలో బీజేపీ అంటూ వ్యాఖ్యలు
Subramanian Swamy comments on Rajinikanth political entry

తమిళనాడు రాజకీయాల్లో సమీకరణాలు మారే సమయం వచ్చింది. ఇన్నాళ్లు ఊహాగానాలకే పరిమితమైన రజనీకాంత్ రాజకీయ పార్టీ త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. పార్టీ పెడతాడా, పెట్టడా అనే అనిశ్చితికి తెరదించుతూ రజనీ స్పష్టమైన ప్రకటన చేశారు. నూతన సంవత్సరంలో రాజకీయ పార్టీ కార్యకలాపాలు షురూ అవుతాయని వెల్లడించారు. దీనిపై బీజేపీ జాతీయ నేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు.

"రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడా, రాడా అనే చర్చ ముగియడం శుభదాయకం. బహుశా తమిళనాడు ఎన్నికల్లో ఈసారి ప్రధాన పోటీ రజనీకాంత్, శశికళ మధ్యే ఉంటుంది. బీజేపీకి డైలమా తప్పదు" అని అభిప్రాయపడ్డారు.

కాగా, అధికార ఏఐఏడీఎంకే రజనీకాంత్ తో పొత్తుకు ఆసక్తి చూపిస్తోంది. డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఈ దిశగా సంకేతాలిచ్చారు. మరికొన్నాళ్లలో అసెంబ్లీ ఎన్నికలు వస్తుండడంతో రజనీ నిర్ణయం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన ఎవరితోనూ పొత్తు లేకుండా సింగిల్ గానే ముందుకు వెళతారని ప్రచారం జరుగుతోంది.