తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన 'బురేవి'

03-12-2020 Thu 21:46
  • పంబన్ కు అత్యంత చేరువలో తీవ్ర వాయుగుండం
  • అర్ధరాత్రి తర్వాత తీరం దాటే అవకాశం
  • మరింత బలహీనపడుతుందని ఐఎండీ వెల్లడి
IMD says Burevi weakened into Deep Depression

తమిళనాడు, కేరళలో భారీ ప్రభావం చూపుతుందని భావించిన బురేవి తుపాను బలహీనపడింది. తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ప్రస్తుతం ఇది పంబన్ తీరానికి అత్యంత చేరువలో నిలిచింది. పంబన్ కు ఆగ్నేయంగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తీవ్ర వాయుగుండం ఈ అర్ధరాత్రి తర్వాత రామనాథపురం, తూత్తుకుడి జిల్లా మధ్య తీరం దాటనుంది.

 తీరం దాటే సమయంలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. భూభాగంపైకి ప్రవేశించిన తర్వాత క్రమంగా బలహీనపడుతుందని వివరించింది.

కాగా, ఐఎండీ ఇంతక్రితం తమిళనాడు, దక్షిణ కేరళ ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అయితే బురేవి బలహీనపడిన నేపథ్యంలో రెడ్ అలెర్ట్ కొనసాగిస్తారా, లేదా అన్నదానిపై స్పష్టత లేదు.