పోయిన చూపు తిరిగొచ్చేలా... హార్వర్డ్ శాస్త్రవేత్తల అద్భుత పరిశోధన!
- కంటిచూపు కోల్పోయిన ఎలుకలపై ప్రయోగం
- బాహ్యజన్యువుల రీప్రోగ్రామింగ్ చేసిన పరిశోధకులు
- నూతనోత్తేజం పొందిన ఎలుకల కళ్లు
హార్వర్డ్ పరిశోధకులు చూపు కోల్పోయిన ఎలుకలపై ప్రయోగాలు చేసి వాటిలో కంటిచూపును పునరుద్ధరించగలిగారు. ఎంతో సంక్లిష్టమైన బాహ్యజన్యువులను రీప్రోగ్రామింగ్ చేయడం ద్వారా వారు ఈ ఘనత సాధించారు. ఎలుకల కళ్లలోని రెటీనాలో ఉండే వృద్ధ కణాలను రీప్రోగ్రామింగ్ చేశారు. మూడు యవ్వన కారక జన్యువులను ఎలుకల రెటీనాలో ప్రవేశపెట్టారు. ఓసీటీ4, ఎస్ఓఎక్స్2, కేఎల్ఎఫ్4 అనే ఈ జన్యువుల ద్వారా ఆ ఎలుకల్లో కంటి చూపు మళ్లీ పుంజుకుంది.
బాహ్యజన్యువుల రీప్రోగ్రామింగ్ ద్వారా కంటిచూపు మాత్రమే కాకుండా ఇతర అవయవాల కణజాలాలను కూడా పునరుత్తేజితం చేయొచ్చని హార్వర్డ్ శాస్త్రవేత్తల పరిశోధనతో వెల్లడైంది. అదే జరిగితే వృద్ధుల్లో వార్ధక్యంతో వచ్చే జబ్బులను కూడా నివారించవచ్చని భావిస్తున్నారు.