చిరంజీవి రాజకీయాల్లోనే కొనసాగి ఉంటే... ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేవారు: పవన్ కల్యాణ్

03-12-2020 Thu 20:55
  • అధికారం అనేది ఒక బాధ్యత
  • ఇసుక, మద్యం అమ్ముకోవడానికి నేను సీఎం కావాలనుకోలేదు
  • నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, మీడియా సంస్థలు లేవు
Pawan Kalyan comments on Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ, కేవలం సినిమాలకే పరిమితమయ్యారు. చిరంజీవి గురించి ఆయన తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి రాజకీయాల్లో కొనసాగి ఉంటే... ఇప్పుడు సీఎం అయ్యేవారని చెప్పారు. అధికారం అనేది అలంకారం కాదని, అదొక బాధ్యత అని చెప్పారు. జనాలపై అజమాయిషీ చేసేందుకే అధికారమని ఇప్పుడు అనుకుంటున్నారని అన్నారు. ఇసుక అమ్ముకోవడానికో, సిమెంటు ఫ్యాక్టరీ కోసమో, మద్యం అమ్ముకోవడానికో తాను ముఖ్యమంత్రి కావాలనుకోలేదని చెప్పారు. వైసీపీకి ఓటు వేసిన వాళ్లంతా బాధ్యత వహించాలని, మరోసారి అలాంటి తప్పు చేయకుండా చూసుకోవాలని సూచించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మిగిలిన వారు 25 కేజీల బియ్యం ఇస్తామంటున్నారని... తాను 25 ఏళ్ల భవిష్యత్తును ఇవ్వాలనుకుంటున్నానని పవన్ చెప్పారు. సెల్ఫీ తీసుకోలేదని, ఫొటో తీసుకోలేదని తనపై కోపం చూపించవద్దని అభిమానులను కోరారు. అమరావతి రైతుల కోసం లాఠీలను దాటుకుని ముందుకు వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇతర రాజకీయ నేతల మాదిరి తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, మీడియా సంస్థలు లేవని... అందుకే సినిమాల్లో నటిస్తున్నానని తెలిపారు.