Union Government: ఏమీ తేల్చకుండానే ముగిసిన చర్చలు... మరోసారి భేటీ కానున్న కేంద్రమంత్రులు, రైతులు!

  • ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో సమావేశం
  • 7 గంటల పాటు చర్చలు
  • డిసెంబరు 5న మరోసారి చర్చించాలని నిర్ణయం
No result in Union ministers and Farmers meeting

కేంద్ర వ్యవసాయ చట్టాలు మాకొద్దంటూ రైతులు.... వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు కేంద్రం.... ఇప్పటికి రెండు పర్యాయాలు సమావేశమైనా ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరలేదు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్న రైతులతో ఇవాళ నిర్వహించిన కేంద్రమంత్రుల సమావేశం అసంపూర్తిగానే ముగిసింది. ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దాంతో డిసెంబరు 5న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

దీనిపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పందిస్తూ, కేంద్రానికి ఎలాంటి అహంలేదని, రైతుల డిమాండ్ల పట్ల సానుకూల ధోరణితో ఉన్నామని స్పష్టం చేశారు. అయితే, రైతుల్లో నూతన వ్యవసాయ చట్టాల పట్ల ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని, సమస్య పరిష్కారానికి తగిన మార్గాలు అన్వేషిస్తున్నామని చెప్పారు. కేంద్రం తరఫున తుది నిర్ణయం వెలువరించేందుకు డిసెంబరు 5 వరకు గడువు తీసుకున్నామని తోమర్ వెల్లడించారు.

అటు, రైతు సంఘాల ప్రతినిధులు రేపు ఉదయం సమావేశమై, ఎల్లుండి జరిగే చర్చలకు హాజరవ్వాలో, వద్దో నిర్ణయించుకోనున్నారు. కాగా, ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో ఇవాళ 7 గంటల పాటు చర్చలు జరిగాయి. కేంద్రం తరఫున నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయల్ హాజరయ్యారు.

More Telugu News