Prakash Singh Badal: పద్మవిభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేసిన మాజీ సీఎం బాదల్

  • రైతుల పోరాటానికి మద్దతుగా నిలిచిన ప్రకాశ్ సింగ్ బాదల్
  • పద్మవిభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్టు రాష్ట్రపతికి లేఖ
  • రైతులు బాధపడుతుంటే.. పద్మ పురస్కార గౌరవం వద్దని వ్యాఖ్య
Punjab Ex CM Prakash Singh Badal returns Padma Vibhushan

కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. వీరి ఆందోళనకు పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. శిరోమణి అకాళీదళ్ నేత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ (92) కూడా రైతులకు మద్దతు ప్రకటించారు. అంతేకాదు తనకు వచ్చిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారు.

ఇక రైతులకు మద్దతుగా పద్మ పురస్కారాన్ని ఇచ్చేసిన తొలి వ్యక్తి ఈయనే కావడం గమనార్హం. 2015లో భారత ప్రభుత్వం బాదల్ ను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ అకాలీదళ్ ఇప్పటికే ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.  

పద్మ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నానని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు బాదల్ లేఖ రాశారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రజల వల్ల ముఖ్యంగా సాధారణ రైతుల వల్ల తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. అలాంటి రైతులు బాధ పడుతున్నప్పుడు... పద్మవిభూషణ్ పురస్కారం వల్ల తనకు వచ్చే గౌరవం అవసరం లేదని అన్నారు.

More Telugu News