జగన్ ఒక క్రియేటర్.. చంద్రబాబును షేక్ చేశారు: రోజా

03-12-2020 Thu 15:44
  • వైసీపీ ఎమ్మెల్యేగా ఉండటం నా పూర్వజన్మ సుకృతం
  • జగన్ మహిళా పక్షపాతి
  • ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును కల్పించాలనేది జగన్ విజన్
Jagan is a creator says Roja

ముఖ్యమంత్రి జగన్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశంసల జల్లు కురిపించారు. శాసనసభలో ఈరోజు సంక్షేమ పథకాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేగా ఉండటం తన పూర్వజన్మ సుకృతమని చెప్పారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు ఒక్క వైసీపీకి మాత్రమే ఉందని అన్నారు. జగన్ మహిళా పక్షపాతి అని చెప్పారు. మహిళలు తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు జగన్ కృషి చేస్తున్నారని అన్నారు. జగన్ ఒక క్రియేటర్ అని, ఎన్నో పథకాలకు రూపకల్పన చేశారని ప్రశంసించారు.

ప్రతి మహిళను జగన్ తోబుట్టువుగా భావిస్తున్నారని రోజా అన్నారు. ప్రతి ఆడబిడ్డను రక్షించేందుకు దిశ చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం అయిన తర్వాత జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు. మహిళలకు ఆస్తులను సృష్టించి ఇస్తున్నారని కొనియాడారు. భావితరాల గురించి జగన్ ఆలోచిస్తున్నారని చెప్పారు. టీవీలో ఎలా కనిపించాలనేది చంద్రబాబు విజన్ అయితే... ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును కల్పించాలనేది జగన్ విజన్ అని అన్నారు. చంద్రబాబు వ్యవస్థలను నాశనం చేశారని రోజా ఆరోపించారు. చంద్రాబాబు, టీడీపీలను జగన్ షేక్ చేశారని చెప్పారు. వార్డు మెంబర్ గా గెలిచే అర్హత కూడా నారా లోకేశ్ కు లేదని అన్నారు.