తెలుగు, మలయాళ ద్విభాషా చిత్రంలో పూజ హెగ్డే!

03-12-2020 Thu 14:27
  • హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా 
  • దుల్ఖర్ సల్మాన్ సరసన నాయికగా పూజ
  • మిలటరీ నేపథ్యంలో సాగే కథ 
  • స్వప్న సినిమాస్ బ్యానర్ పై నిర్మాణం  
Pooja Hegde in a bilingual movie

'అల వైకుంఠపురములో' సినిమా విజయంతో అగ్రతారల జాబితాలో చేరిపోయిన అందాలభామ పూజ హెగ్డే ప్రస్తుతం 'రాధే శ్యామ్', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాలలో నటిస్తోంది. అటు హిందీలో కూడా కొన్ని సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో తాజగా ఈ ముద్దుగుమ్మ తెలుగులో మరో చిత్రానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. హ్యాండ్ సమ్ హీరో దుల్ఖర్ సల్మాన్ హీరోగా రూపొందే సినిమాలో ఈ చిన్నది కథానాయికగా నటించనుంది.

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కూతురు స్వప్నదత్ తమ 'స్వప్న సినిమాస్' బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిలటరీ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రంలో దుల్ఖర్ మిలటరీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నట్టు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో నిర్మించడానికి ప్లాన్ చేశారని అంటున్నారు.

కాగా, ప్రముఖ ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి తనయుడైన దుల్కర్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ వుంది. 'మహానటి' సినిమాతో పాటు కొన్ని డబ్బింగ్ సినిమాల ద్వారా యూత్ కి బాగా దగ్గరయ్యాడు.