ఎంతో మంది నన్ను విమర్శిస్తున్నారు.. దారుణమైన పోస్టులు పెడుతున్నారు: అలియా భట్

03-12-2020 Thu 12:51
  • సుశాంత్ మరణం తర్వాత నెపోటిజంపై తీవ్ర విమర్శలు
  • స్టార్ కిడ్స్ కు తప్ప ఇతరులకు అవకాశం దక్కడం లేదని నెటిజన్ల మండిపాటు
  • అలియాపై తీవ్ర స్థాయిలో కామెంట్లు చేస్తున్న నెటిజన్లు
Alia Bhatt says she has faced lot of hate

నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో నెలకొన్న బంధుప్రీతి (నెపోటిజం)పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కరణ్ జొహార్, మహేశ్ భట్ తో పాటు మరికొందరు బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. స్టార్ కిడ్స్ కి తప్ప ఇతరులకు ఇండస్ట్రీలో అవకాశం దక్కకుండా అణచి వేస్తున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు దుయ్యబట్టారు. ఈ విమర్శలను తట్టుకోలేక ఒకానొక సమయంలో కరణ్ జొహార్ తీవ్ర మనస్తాపానికి కూడా గురయ్యాడు.

మరోవైపు, మహేశ్ భట్ ముద్దుల తనయ అలియా భట్ కూడా నెటిజన్లకు టార్గెట్ గా మారింది. అలియాకు అందం, అభినయం లేకున్నా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతోందని... మహేశ్ భట్ కూతురు కావడమే ఆమెకున్న ఏకైక అర్హత అంటూ తీవ్ర వ్యాఖ్యలతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో అలియా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇటీవలి కాలంలో తాను చాలా విద్వేషాన్ని ఎదుర్కొన్నానని అలియా పేర్కొంది. ఎంతో మంది నెటిజన్లు తనను ప్రతిరోజు విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనను తిడుతూ దారుణమైన పోస్టులు పెడుతున్నారని చెప్పింది. అయితే ఆ విమర్శలు, తిట్లే తనకు ప్రేరణగా నిలుస్తున్నాయని తెలిపింది. తాను ఎదుర్కొన్న అనుభవాలు తనకు ఎన్నో విషయాలను నేర్పాయని, ఎదుటి వ్యక్తి పట్ల దయతో వ్యవహరించాలనే విషయం తనకు అర్థమైందని చెప్పింది. ఎదుటి మనిషినే కాకుండా, మనం నివసిస్తున్న ఈ భూమి పట్ల కూడా ప్రేమతో ఉండాలని వ్యాఖ్యానించింది.