దేశంలో టాప్-10లో నిలిచిన తెలంగాణలోని పోలీస్ స్టేషన్.. జాబితా విడుదల చేసిన కేంద్రం

03-12-2020 Thu 12:35
  • మెరుగైన ప్రతిభను కనబుర్చుతోన్న పోలీస్ స్టేషన్లు
  • ఈ ఏడాది టాప్-10 పోలీస్ స్టేషన్ల జాబితా విడుదల
  • మణిపూర్ తౌబల్ నాంగ్‌పోక్ జిల్లాలోని ‌సెక్మయికి అగ్రస్థానం
jammikunta ps places in top 10 ps in india

భారత్‌లో మెరుగైన ప్రతిభను కనబురుచుతూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న పోలీస్‌ స్టేషన్లలో జాబితాలో  తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్‌ స్టేషన్‌ టాప్-10లో నిలిచింది. 2020 ఏడాదికి సంబంధించిన ఈ జాబితాను కేంద్ర హోంశాఖ విడుదల చేసిందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది. ప్రతి ఏడాది కేంద్ర హోం శాఖ ఈ జాబితాను విడుదల చేస్తుంది.  అన్ని విభాగాల్లో పోలీస్‌ స్టేషన్ల పనితీరును పరిశీలించి ఈ ర్యాంకులు ఇస్తారు.

పోలీస్ స్టేషన్లకు ప్రతి ఏడాది ఈ ర్యాంకులు ఇవ్వాలని 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకులు విడుదల చేస్తోంది. దేశంలోని 16,671 పోలీసు స్టేషన్ల పనితీరుని పరిశీలించి ఈ ర్యాంకులు ఇస్తారు. చివరకు ప్రతి రాష్ట్రం నుంచి ఒకటి లేదా రెండు పోలీసు స్టేషన్లు జాబితాలో నిలుస్తాయి. వాటిల్లో టాప్-10 పోలీస్ స్టేషన్ల జాబితాను విడుదల చేస్తారు.  

ఈ ఏడాది టాప్-10 పోలీస్ స్టేషన్లు..

1.మణిపూర్ తౌబల్ నాంగ్‌పోక్ జిల్లాలోని ‌సెక్మయి
2. తమిళనాడు సేలం జిల్లాలోని ఏడబ్ల్యూపీఎస్- సురమంగళం
3. అరుణాచల్ ప్రదేశ్ చాంగ్లాంగ్ జిల్లాలోని ఖర్సాంగ్ పోలీస్ స్టేషన్
4. ఛత్తీస్‌గఢ్ సూరజ్‌పూర్ జిల్లాలోని జిల్మిలి (భయ థానా)  స్టేషన్
5. గోవాలోని దక్షిణ గోవా జిల్లాలోని సాంగుమ్ స్టేషన్
6. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఉత్తర-మధ్య అండమాన్ జిల్లాలోని కలిఘాట్ పోలీసు స్టేషన్
7. సిక్కిం తూర్పు జిల్లాలోని పాక్యాంగ్  స్టేషన్
8. ఉత్తర ప్రదేశ్ మొరాదాబాద్ జిల్లాలోని కాంత్ స్టేషన్
9. దాద్రా నగర్ హవేలిలోని దాద్రా అండ్ నగర్ హవేలి ఖాన్వెల్ స్టేషన్
10. తెలంగాణ కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట నగర పోలీస్ స్టేషన్

.