కొడాలి నాని ఇంటి వద్ద భారీ భద్రత.. డిజిటల్ స్కానర్లు, మెటల్ డిటెక్టర్ ఏర్పాటు!

03-12-2020 Thu 12:24
  • గత ఆదివారం మంత్రి పేర్ని నానిపై దాడి
  • ఈ ఘటనతో అప్రమత్తమైన ప్రభుత్వం
  • కొడాలి నాని నివాసాన్ని అధీనంలోకి తీసుకున్న భద్రతా సిబ్బంది
Security tightened at Kodali Nanis residence

ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నానిపై గత ఆదివారం దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. కృష్ణా జిల్లాకు చెందిన మంత్రుల నివాసాలు, వారి కార్యాలయాల వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేసింది. గుడివాడలోని కొడాలి నాని నివాసం వద్ద మెటల్ డిటెక్టర్, డిజిటల్ స్కానర్లను ఏర్పాటు చేశారు.

 నాని నివాసంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. ఆయన నివాసాన్ని భద్రతా సిబ్బంది తన అధీనంలోకి తీసుకుంది. మంత్రిని కలిసేందుకు వస్తున్న ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆ తర్వాతే ఆయన నివాసంలోకి అనుమతిస్తున్నారు.

గత ఆదివారం పేర్ని నాని తల్లి దశ దిన కర్మ జరిగింది. ఆ సమయంలో పేర్ని నాని ఇంటికి వెళ్లిన బడుగు నాగేశ్వరరావు అనే వ్యక్తి ఆయనపై దాడి చేశాడు. తనతో పాటు తెచ్చుకున్న తాపీతో మంత్రిపై దాడికి యత్నించాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, మంత్రి అనుచరులు నాగేశ్వరరావును పట్టుకున్నారు. దాడికి ముందు అతను రెక్కీ కూడా నిర్వహించినట్టు పోలీసులు చెపుతున్నారు. ఈ దాడి ఘటన నేపథ్యంలో, జిల్లాలోని ఇతర మంత్రుల నివాసాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.