ప్రమాదం జరిగి వారమైనా... ఇంకా లభించని మిగ్ పైలెట్ ఆచూకీ!

03-12-2020 Thu 12:16
  • లొకేటర్ సిగ్నల్స్ అందడం లేదు
  • స్పష్టం చేసిన నేవీ అధికారులు
  • సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని వెల్లడి
One Week After MIG Crash no Trace of Pilot

అరేబియా సముద్రంలో మిగ్ 29కే విమానం కుప్పకూలిన తరువాత, వారం రోజులు గడిచినా ఎమర్జెన్సీ ఎజెక్టర్ సీటుకు అమర్చి ఉండే లొకేటర్ నుంచి ఎటువంటి సిగ్నల్స్ అందలేదని నేవీ వర్గాలు వెల్లడించాయి. ఈ విమానంలో ఇద్దరు పైలెట్లు ఉండగా, ఒకరు ప్రాణాలతో బయటపడగా, ప్రమాదానికి కొన్ని సెకన్ల ముందు రెండో పైలెట్ కమాండర్ నిశాంత్ సింగ్ కూడా విమానంలో నుంచి బయటపడ్డారు. అతని కోసం వారంరోజులుగా వెతుకులాట కొనసాగుతోంది.

గత గురువారం నాడు నిశాంత్ సింగ్, ఇన్ స్ట్రక్టర్ పైలట్ లు ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుంచి టేకాఫ్ తీసుకుని వెళ్లిన కాసేపటికే ఈ ప్రమాదం జరుగగా, ఆపై కాసేపటికే ఓ హెలికాప్టర్ పైలెట్ ను గుర్తించి కాపాడింది. విమానంలో ఉన్న రెండో పైలెట్ ఆచూకీ మాత్రం ఇంతవరకూ తెలియరాలేదు. ప్రస్తుతానికి లొకేటర్ బీకాన్ విఫలమైందని చెప్పలేమని నేవీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ యూనిట్ సముద్ర ఉపరితలంపై ఉంటేనే పని చేస్తుందని, నీటిలో మునిగితే మాత్రం పనిచేయదని అధికారులు అంటున్నారు.

కాగా, ఈ వారం ప్రారంభంలో సముద్రంలో 100 మీటర్ల దిగువన కూలిన విమానాన్ని గుర్తించగా, అందులో పైలట్ సీట్లు రెండూ లేవు. దీంతో ఇద్దరూ ప్రమాదానికి ముందే బయటకు వచ్చినట్టుగా తేల్చిన అధికారులు, సెర్చ్ ఆపరేషన్ ను ఇంకా కొనసాగిస్తున్నారు.