తరగతి గదిలో మైనర్ బాలిక మెడలో తాళి కట్టిన మైనర్... రాజమండ్రిలో వీడియో వైరల్!

03-12-2020 Thu 12:00
  • క్లాస్ లో ప్రియురాలికి తాళికట్టిన విద్యార్థి
  • టీసీ ఇచ్చి పంపిన ప్రిన్సిపాల్
  • పరువు పోయిందని వాపోతున్న తల్లిదండ్రులు
Inter Students Marriage in Classroom Video goes viral

వారిద్దరూ మైనర్లే... ఇద్దరూ చదువుతున్నది ఇంటర్ రెండో సంవత్సరం. వీరిద్దరూ తాము చదువుతున్న తరగతి గదిలోనే పెళ్లి చేసుకుని కలకలం సృష్టించారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగింది. ఈ తూతూమంత్రపు పెళ్లిని వీడియో కూడా తీశారు. బాలిక మెడలో తాళి కట్టిన విద్యార్థి, ఆపై ఆమెకు బొట్టు పెడుతున్న దృశ్యాలు నగర వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీంతో స్పందించిన కాలేజీ ప్రిన్సిపాల్, ఇద్దరికీ ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్లు ఇచ్చి పంపించి వేశారు.అయితే, తామేమీ నిజమైన పెళ్లి చేసుకోలేదని, వీడియోకు సామాజిక మాధ్యమాల్లో లైక్స్ కోసమే తాము ఈ పని చేశామని వారిద్దరూ చెప్పడం గమనార్హం. ఈ విషయంలో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని కాలేజీ యాజమాన్యం చెప్పగా, తమ పిల్లలు చేసిన పనికి పరువు పోయిందని తల్లిదండ్రులు వాపోతున్నారు.

ఇక ఈ వీడియోను తీసింది మరో బాలికని తెలుస్తోంది. మధ్యమధ్యలో సలహాలు కూడా ఇచ్చింది. బొట్టు ఎలా పెట్టాలన్న విషయాన్ని స్వయంగా చెబుతోంది కూడా. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.