క్రిష్ తాజా చిత్రం టైటిల్ 'కొండపొలం'?

03-12-2020 Thu 11:55
  • వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా క్రిష్ సినిమా 
  • 'కొండపొలం' నవల ఆధారంగా చిత్రకథ
  • 45 రోజుల్లో పూర్తిచేసిన చిత్రనిర్మాణం
  • మేకప్ లేకుండా నటించిన రకుల్  
Krish latest movie title fixed

కమర్షియల్ సినిమానే కొత్తదనంతో చెప్పాలని పరితపించే దర్శకుడు క్రిష్. అందుకే, భారీ చిత్రాల మధ్యలో అప్పుడప్పుడు చిన్న బడ్జెట్ చిత్రాలను కూడా ఆయన తెరకెక్కిస్తుంటాడు. ఈ కోవలో ఆయన తాజాగా ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. 'ఉప్పెన' ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా.. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా ఇందులో నటిస్తున్నారు.

లాక్ డౌన్ తర్వాత కోవిడ్ నిబంధనలు పక్కాగా పాటిస్తూ వికారాబాద్ అడవుల్లో ఈ చిత్రం షూటింగును నిర్వహించారు. కేవలం 45 రోజుల్లో చిత్రం షూటింగును సింగిల్ షెడ్యూల్ లో క్రిష్ పూర్తిచేశారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన అవార్డు నవల 'కొండపొలం' ఆధారంగా ఈ చిత్రాన్ని ఆయన రూపొందిస్తున్నారు. ఇక సినిమా టైటిల్ విషయానికి వస్తే, 'కొండపొలం' పేరునే ఆయన ఖరారు చేసినట్టు తాజా సమాచారం. కథకు అదే సరైన టైటిల్ అని ఆయన భావిస్తున్నారట.

ఈ చిత్రంలో కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ గిరిజన యువతిగా కనిపిస్తుంది. దాంతో ఆమె మేకప్ లేకుండా ఇందులో నటించినట్టు చెబుతున్నారు. అంటే రకుల్ డీ- గ్లామరైజ్డ్ పాత్రలో కనిపిస్తుందన్నమాట!