ట్రేడింగ్ ప్రారంభంలోనే ఆల్ టైమ్ రికార్డుకు సెన్సెక్స్, నిఫ్టీ!

03-12-2020 Thu 10:00
  • తొలిసారిగా 44,953 పాయింట్లను తాకిన సెన్సెక్స్
  • ఉత్సాహంగా నూతన కొనుగోళ్లు
  • ప్రస్తుతం అర శాతం లాభంలో సూచికలు
Indian Stock Market Touches Record High

భారత స్టాక్ మార్కెట్ సూచికలు ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సరికొత్త రికార్డులను తాకాయి. సెషన్ ప్రారంభంలో 44,953 పాయింట్ల ఆల్ టైమ్ రికార్డును సెన్సెక్స్ తాకింది. ఆపై కాస్తంత దిగివచ్చినా, రికార్డు స్థాయులను కొనసాగిస్తోంది.

కరోనా టీకాను యూకే అనుమతించడం, అమెరికా, బ్రెజిల్ తదితర దేశాల్లోనూ టీకాకు నేడో, రేపో అనుమతులు రానున్నాయన్న వార్తలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ ఉత్సాహంతో సాగుతుండగా, అదే ప్రభావం సెన్సెక్స్, నిఫ్టీలపైనా కనిపించింది. దేశవాళీ సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు ఫండ్ సంస్థలు, విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీలను కొనుగోలు చేస్తున్నారు.

ఇక, ఈ ఉదయం 10 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక, క్రితం ముగింపుతో పోలిస్తే 143 పాయింట్లు పెరిగి 44,761 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక, క్రితం ముగింపుతో పోలిస్తే, 50 పాయింట్లు పెరిగి 13,164 పాయింట్లకు చేరింది. ప్రీ ఓపెన్ సెషన్ లో నిఫ్టీ సూచిక 13,228 పాయింట్ల వరకూ వెళ్లింది.

మారుతి సుజుకి, హిందాల్కో, గెయిల్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్ తదితర కంపెనీలు లాభాల్లో నడుస్తుండగా, ఎస్బీఐ లైఫ్, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, గ్రాసిమ్, యాక్సిస్ బ్యాంక్ లు స్వల్ప నష్టాల్లో సాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల విషయానికి వస్తే, చైనా, జపాన్ సూచీలు నామమాత్రపు నష్టాల్లో ఉండగా, ఉత్తర కొరియా, ఇండొనేషియా, హాంకాంగ్ తదితర దేశాల స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి.