దేశంలో 77 శాతం తేనెలు కల్తీ గురూ!

03-12-2020 Thu 09:36
  • జర్మనీలో నిర్వహించిన పరీక్షల్లో నకిలీ గుట్టు రట్టు
  • 17 బ్రాండ్ల తేనెల్లో కల్తీ.. 5 బ్రాండ్లలో మాత్రమే నాణ్యతా ప్రమాణాలు
  • తేనెలో 80 శాతం కల్తీ అయినా పరీక్షల్లో దొరకని వైనం
Leading honey brands fail adulteration test by foreign lab

దేశంలో వివిధ బ్రాండ్ల పేరిట మార్కెట్లో లభిస్తున్న తేనెలకు సంబంధించి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) సంచలన విషయాన్ని వెల్లడించింది. దేశంలో అమ్ముడవుతున్న తేనెల్లో 77 శాతం కల్తీవని తేల్చింది. అయితే, 5 బ్రాండ్లు మాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాయని, మిగతావి మాత్రం పంచదార పాకంతో కల్తీ చేసి విక్రయిస్తున్నట్టు తెలిపింది. దేశంలోని 13 బ్రాండ్ల తేనెల నాణ్యతను పరిశీలించిన అనంతరం సీఎస్‌ఈ ఈ విషయాన్ని వెల్లడించింది. మొత్తం 22 తేనెల నమూనాలను పరీక్షించగా వాటిలో 17 శాతం తేనెలు కల్తీ అయినట్టు గుర్తించింది.

ఈ నమూనాలను తొలుత గుజరాత్‌లోని పశువుల ఆహార, అభ్యసన కేంద్రం (సీఏఎల్ఎఫ్), కర్ణాటకలోని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ)లో పరీక్షించగా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నట్టు తేలింది. అయితే, ఆ తర్వాత వాటిని జర్మనీలోని ప్రత్యేక లేబరేటరీలోని న్యూక్లియర్ మాగ్నటిక్ రెసొనెన్స్ (ఎన్ఎంఆర్)లో పరీక్షించగా  నాణ్యతా ప్రమాణాల్లో వీగిపోయాయి. విషయం తెలిసి తాము ఒక్కసారిగా ఆశ్చర్యపోయామని, కల్తీవ్యాపారం  దేశంలో పెద్ద ఎత్తున సాగుతోందనడానికి ఇది నిదర్శనమని  సీఎస్ఈ ప్రోగ్రాం డైరెక్టర్ అమిత్ ఖురానా పేర్కొన్నారు.

కల్తీ తేనెనే ప్రజలంతా తీసుకుంటున్నారని, ఇది బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. తేనెలో 50 నుంచి 80 శాతం కల్తీ జరిగినా పరీక్షల్లో గుర్తించలేమని సీఎస్ఈ జనరల్ డైరెక్టర్ సునీతా నరైన్ పేర్కొన్నారు. కరోనా కాలంలో ప్రజలు పెద్ద ఎత్తున తేనెను తీసుకున్నారని, అయితే కల్తీ తేనెల వల్ల అది ఆరోగ్యాన్ని ఇవ్వకపోగా, అనారోగ్యానికి గురిచేస్తోందని పేర్కొన్నారు. దేశంలో నాణ్యతా ప్రమాణాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేస్తోందని సునీత నరైన్ పేర్కొన్నారు.