Madhura: శ్రీకృష్ణుడి పేరు చెప్పి వేలాది చెట్లను నరుకుతామంటే అంగీకరించబోము: యూపీకి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

UP Cant Cut Trees for Lord Krishna ordered Supreme Court
  • మధుర జిల్లాలో శ్రీ కృష్ణ మందిరం
  • 25 కిలోమీటర్ల రహదారి కోసం 2,940 చెట్లు అడ్డం
  • వాటిని తొలగించే వీల్లేదన్న సీజే ధర్మాసనం
శ్రీకృష్ణుడి పేరు చెప్పి, దాదాపు 3 వేల చెట్లను నరికి వేస్తామంటే అంగీకరించేది లేదని సుప్రీంకోర్టు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మధుర జిల్లాలో ఉన్న ఓ శ్రీ కృష్ణ మందిరానికి వెళ్లేందుకు వీలుగా 25 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించాలని భావించిన యూపీ ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ విభాగం, 2,940 చెట్లను తొలగించాల్సి వుందని, ఇందుకోసం రూ. 138.41 కోట్ల నష్టపరిహారాన్ని ఇస్తామని, తమకు అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ కేసును విచారించిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బొప్పన, జస్టిస్ వీ రామసుబ్రమణియన్ ల ధర్మాసనం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పేర్కొంది. చెట్లను కొట్టివేసిన తరువాత, మరిన్ని చెట్లను నాటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పగా, ఈ మాటలతో తాము మనసు మార్చుకోబోమని, 100 సంవత్సరాల వయసున్న చెట్టును తొలగించి, ఓ మొక్కను నాటడం సమానం కాదని ఈ సందర్భంగా బాబ్డే అభిప్రాయపడ్డారు.

"చెట్లు ప్రాణవాయువును అందిస్తాయి. దాని విలువను లెక్కించలేము. చెట్ల మిగిలిన జీవిత కాలాన్ని బట్టి, దాని విలువ మారుతుంటుంది. చెట్లను నరకడానికి అంగీకరించలేము" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో కృష్ణ మందిరానికి రహదారి నిర్మించే విషయంలో మరో ప్రతిపాదనతో నాలుగు వారాల్లోగా కోర్టు ముందుకు రావచ్చని పేర్కొంది.
Madhura
Sri Krishna Mandir
Trees
Supreme Court
SA Bobde

More Telugu News