రెండున్నరవేలకు కొని 4 వేలకు విక్రయం.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల డ్రగ్స్ వ్యాపారం!

03-12-2020 Thu 08:43
  • గోవా, విశాఖపట్టణం నుంచి డ్రగ్స్ తెప్పిస్తూ నగరంలో విక్రయం
  • లక్ష రూపాయలకు కిలో హషిష్ ఆయిల్ కొనుగోలు
  • 12 గ్రాముల ఆయిల్‌ రూ. 2,500కు విక్రయం
  • ముగ్గురి అరెస్ట్.. పరారీలో కీలక నిందితుడు
Hyderabad police arrested 3 software engineers for selling drugs

చేసిది సాఫ్ట్‌వేర్ ఉద్యోగమైనా ఈజీ మనీకి అలవాటుపడిన కొందరు యువకులు డ్రగ్స్ విక్రయిస్తూ అడ్డంగా దొరికిపోయారు. హైదరాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని మౌలాలి ఆర్టీసీ కాలనీకి చెందిన శివసేనారెడ్డి (27), వనస్థలిపురం కమలానగర్‌కు చెందిన మేకసాయి విపిన్ (27), ఘట్‌కేసర్ పోచారంలోని సింగపూర్ టౌన్‌షిప్‌కు చెందిన హర్షవర్ధన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు.

వీరు గోవా, విశాఖపట్టణం నుంచి డ్రగ్స్ తెప్పించి నగరంలో విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో తార్నాక వద్ద పోలీసులు కాపుకాశారు. బైక్‌పై వచ్చిన శివసేనారెడ్డి, సాయి విపిన్‌లను ఆపిన పోలీసులు తనిఖీ చేయగా 150 మైక్రోగ్రాముల చొప్పున 56 ఎల్ఎస్‌డీ బ్లాట్స్, 12 గ్రాముల చొప్పున రెండు హషిష్ ఆయిల్ సీసాలు లభ్యమయ్యాయి. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు.

ఎల్ఎస్‌డీ బ్లాట్స్‌ను తాము గోవా నుంచి ఒక్కో దానిని రూ. 2 వేలకు తెప్పిస్తున్నట్టు శివసేనారెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించాడు. హర్షవర్ధన్ నుంచి హషిష్ ఆయిల్‌ను కొనుగోలు చేసినట్టు సాయి విపిన్ అంగీకరించాడు. ఒక్కో సీసాను రూ. 2,500కు కొనుగోలు చేసి రూ. 4 వేలకు విక్రయిస్తున్నట్టు చెప్పాడు. సాయి విపిన్ ఇచ్చిన సమాచారంతో సింగపూర్ టౌన్‌షిప్‌లోని హర్షవర్ధన్ ఫ్లాట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు తనిఖీ చేశాయి. ఈ సందర్భంగా హషిష్ ఆయిల్ సీసాలు పట్టుబడ్డాయి.

విశాఖపట్టణానికి చెందిన కార్తీక్ నుంచి కిలో ఆయిల్‌ను లక్ష రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్టు ఈ సందర్భంగా హర్షవర్ధన్ తెలిపాడు. అనంతరం 12 గ్రాముల ఆయిల్‌ను రూ. 2,500కు విక్రయిస్తున్నట్టు చెప్పాడు. పరారీలో ఉన్న కార్తీక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, శివసేనారెడ్డి మూడేళ్ల క్రితం కూడా ఇలాగే ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు చిక్కడం గమనార్హం.