రైతులతో చర్చలకు ముందు పంజాబ్ సీఎంను కలవనున్న అమిత్ షా!

03-12-2020 Thu 08:38
  • నేడు రైతులతో మరో విడత చర్చలు
  • మంగళవారం చర్చలు అసంపూర్ణం
  • ఢిల్లీకి చేరుకున్న అమరీందర్ సింగ్
Amareender to Meet Amit Shah Today

నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతల మధ్య మరో విడత చర్చలు జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కలవనున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీకి చేరుకోగా, ఉదయం 9.30 గంటలకు ఈ కీలక సమావేశం జరుగనుంది. రైతులతో మంగళవారం నాడు జరిగిన చర్చలు అసంపూర్ణంగా మిగిలాయన్న సంగతి తెలిసిందే.

రైతుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం స్పష్టం చేయగా, రైతు సంఘాల ప్రతినిధులు దాన్ని ఏకగ్రీవంగా తిరస్కరించారు. ఈ బిల్లులను వెనక్కు తీసుకోవాల్సిందేనని వారు స్పష్టం చేశారు. ఇదిలావుండగా, కేవలం ఒకే సమావేశం తరువాత రైతులు, కేంద్రం మధ్య ఏకాభిప్రాయం వచ్చి సమస్యలు సద్దుమణుగుతాయని భావించడం లేదని, ప్రభుత్వం ఈ చట్టాలను చారిత్రాత్మక సంస్కరణలుగా భావిస్తున్నందున వీటిని వెనక్కు తీసుకునే అవకాశాలు లేవని వ్యవసాయ రంగ నిపుణులు అంటున్నారు.

ఇదే సమయంలో రైతులు సైతం ఏ మాత్రమూ వెనక్కు తగ్గేందుకు సిద్ధంగా లేరు. ఓ కమిటీని నియమించే బదులు, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి, కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్న ఈ చట్టాలను వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి గురువారం చివరి అవకాశమని, రైతులకు అనుకూలంగా నిర్ణయం వెలువడకుంటే, నిరసనలు మరింతగా పెరిగి ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని లోక్ సంఘర్ష్ మోర్చా నేత ప్రతిభా షిండే హెచ్చరించారు.