నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 18 పరుగులు చేసిన మంత్రి హరీశ్‌రావు.. టీ20లో మెరుపులు!

03-12-2020 Thu 08:16
  • సిద్దిపేట జిల్లా క్రికెట్ అసోసియేషన్,  మెడికవర్ ఆసుపత్రి జట్ల టీ20 మ్యాచ్
  • 12 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసిన మంత్రి హరీశ్ రావు
  • సిద్దిపేట జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్
telangana minister Harish Rao got 18 runs in 12 balls

రాజకీయాల్లో తలమునకలుగా గడిపే తెలంగాణ రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు టీ20 ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెరుపులు మెరిపించారు. అచ్చం ప్రొఫెషనల్‌ క్రికెటర్‌లా ఆడి 12 బంతుల్లో మూడు ఫోర్లతో 18 పరుగులు చేశారు. హరీశ్‌రావు సారథ్యంలోని సిద్దిపేట జిల్లా క్రికెట్ అసోసియేషన్, హైదరాబాద్‌కు చెందిన మెడికవర్ ఆసుపత్రి జట్ల మధ్య గత రాత్రి స్నేహపూర్వక టీ20 మ్యాచ్‌ జరిగింది. సిద్దిపేట లఘు క్రీడా మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిద్దిపేట నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మంత్రి హరీశ్‌రావు ప్రొఫెషనల్ క్రికెటర్‌ను తలపించారు. 12 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 18 పరుగులు చేశారు.

అనంతరం 166 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన మెడికవర్ జట్టు మరో బంతి మిగిలి ఉండగానే 150 పరుగులకు ఆలవుటై 15 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కాగా, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ కూడా సిద్దిపేట జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గమనార్హం.