పవన్ కల్యాణ్ ర్యాలీలో అపశ్రుతి.. రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

03-12-2020 Thu 07:56
  • తుపాను బాధిత రైతులను పరామర్శించిన పవన్
  • జనసేన కార్యకర్తల భారీ బైక్ ర్యాలీ
  • ర్యాలీని ఢీకొట్టిన కారు
4 injured in pawan kalyan bike rally

నివర్ తుపాను ధాటికి నష్టపోయిన పంటలను పరిశీలించి, రైతులతో చర్చించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు నిర్వహించిన బైక్ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. పామర్రు మండలం కురుమద్దాలి పెట్రోలు బంకు సమీపంలో విజయవాడవైపు నుంచి వస్తున్న కారు ర్యాలీలోని రెండు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు కార్యకర్తలు గాయపడ్డారు.

పెనమలూరుకు చెందిన అబ్దుల్ సుక్‌నబీ, పామర్రు మండలం జమీదగ్గుమిల్లికి చెందిన కేత పవన్‌జేత, తోట నరేంద్ర, పామర్రు శివారులోని శ్యామలాపురానికి చెందిన గుమ్మడి వంశీ గాయపడ్డారు. వీరిలో ఇద్దరిని విజయవాడ ఆసుపత్రికి తరలించగా, మరో ఇద్దరిని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.