America: అమెరికాలో గుండెపోటుతో మరణించిన హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

  • బఫే నగరంలో ఎంఅండ్‌టీ బ్యాంకులో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్న శ్రీధర్
  • ఈ నెల 26న నిద్రలోనే గుండెపోటుతో కన్నుమూత
  • మృతదేహాన్ని రప్పించడంలో సాయం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వేడుకోలు
Hyderabad software engineer died in newyork

న్యూయార్క్‌ బఫే నగరంలోని ఎంఅండ్‌టీ బ్యాంకులో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన పానుగంటి శ్రీధర్ (38) గుండెపోటుతో మరణించారు. గత నెల 26న ఈ ఘటన జరగ్గా ఇప్పటి వరకు మృతదేహం భారత్‌కు చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

భార్య ఝాన్సీ, కుమారుడు స్రాజన్ (5)తో కలిసి అక్కడే ఉంటున్న శ్రీధర్ 26న రాత్రి నిద్రలోనే గుండెపోటుకు గురై మరణించారు. ఆ సమయంలో భార్య, కుమారుడు భారత్‌లోనే ఉన్నారు. తన తమ్ముడి వివాహం కోసం కుమారుడిని తీసుకుని ఝాన్సీ హైదరాబాద్ వచ్చారు. శ్రీధర్ మాత్రం పని ఒత్తిడి వల్ల రాలేకపోయారు.

ఈ నెల 27న ఉదయం భర్తకు ఫోన్ చేసిన ఝాన్సీ ఎంతకూ స్పందించకపోవడంతో అపార్ట్‌మెంట్ వాసులకు ఫోన్ చేసి చెప్పారు. వారు శ్రీధర్ ఫ్లాట్‌లోకి వెళ్లి చూడగా అతడు మంచంపై విగతజీవిగా కనిపించాడు.  దీంతో అమెరికా ఎమర్జెన్సీ నంబర్‌ 911కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది శ్రీధర్ గుండెపోటుతోనే మృతి చెంది ఉంటాడని అనుమానిస్తూ పోస్టుమార్టానికి తరలించారు.

పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన అనంతరం శ్రీధర్ మృతదేహాన్ని భారత్‌కు తరలించనున్నారు. ఇందుకు మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉందని పోలీసులు చెప్పడంతో నగరంలోని శ్రీధర్ కుటుంబం దిక్కుతోచక విలపిస్తోంది. తమ కుమారుడి మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరుతూ బాధిత కుటుంబం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

More Telugu News