కథానాయకుడిగా దర్శకేంద్రుడి పాత్రపై అప్ డేట్!

02-12-2020 Wed 20:57
  • తనికెళ్ల భరణి దర్శకత్వంలో రాఘవేంద్రరావు 
  • విశ్రాంత ఉద్యోగిగా వయసుకు తగ్గా పాత్ర
  • భార్య పాత్రలో నటించనున్న రమ్యకృష్ణ  
K Raghavendra Rao to play as retired employee

తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో కమర్షియల్ హిట్ సినిమాలతో పాటు 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' వంటి భక్తిరస ప్రధాన చిత్రాలను కూడా రూపొందించి ఎనలేని కీర్తిని సంపాదించుకున్న దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తాజాగా నటుడిగా మారుతున్న సంగతి తెలిసిందే. 78 ఏళ్ల వయసులో ఆయన కథానాయకుడుగా కెమెరా ముందుకు వస్తున్నారు.

ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి దర్శకత్వం వహించే ఓ చిత్రంలో రాఘవేంద్రరావు కథానాయకుడిగా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ వార్త వెలువడినప్పటి నుంచీ ఈ చిత్రంలో ఆయన ఎటువంటి పాత్రను పోషించనున్నారన్న ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది. తాజా సమాచారాన్ని బట్టి, ఇందులో ఆయన విశ్రాంత ఉద్యోగి (రిటైర్డ్ ఎంప్లాయీ)గా కనిపిస్తారట. అంటే వయసుకు తగ్గా పాత్ర అన్నమాట.

ఇక ఇందులో ఆయన భార్యగా ప్రముఖ నటి రమ్యకృష్ణ నటించనున్నారని తెలుస్తోంది. అలాగే మరో ముగ్గురు కథానాయికలు కూడా ఆయన సరసన నటించనున్నారని, వారిలో శ్రియ, సమంతలను ఇప్పటికే ఎంపిక చేశారని అంటున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.