చివరి వన్డేలో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన భారత్

02-12-2020 Wed 18:09
  • 13 పరుగులతో విజయం సాధించిన భారత్
  • 92 పరుగులు చేసిన పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
  • 2-1తో వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా
India won by 13 runs in 3rd ODI

ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియాకు ఊరట లభించింది. తొలి రెండు వన్డేలలో ఓటమిపాలైన భారత్ కాన్ బెర్రాలో ఈరోజు జరిగిన చివరి వన్డేలో 13 పరుగుల తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది. వన్డే సిరీస్ ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో సొంతం చేసుకుంది.

ఈరోజు టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత్ కు శుభారంభం దక్కలేదు. నాలుగో ఓవర్ లోనే ధావన్ 16 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ... శుభ్ మన్ గిల్ తో కలిసి ఇన్నింగ్స్ ను నిర్మించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత గిల్ (33), శ్రేయస్ అయ్యర్ (19), కేఎల్ రాహుల్ (5) త్వరగానే పెవిలియన్ చేరారు. 63 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఔట్ కావడంతో ఇండియా కష్టాల్లో పడింది. అయితే మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన హార్దిక్ పాండ్యా (92), జడేజా (66) చివర్లో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో లబుషేన్ 7 పరుగులు, ఫించ్ 75, స్మిత్ 7, హెన్రిక్స్ 22, గ్రీన్ 21, క్యారీ 38, మ్యాక్స్ వెల్ 59, అగర్ 28, అబాట్ 4, జంపా 4, హ్యాజల్ వుడ్ 7 పరుగులు చేశారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా బుమ్రా, నటరాజన్ చెరో రెండు, కుల్దీప్ యాదవ్, జడేజా చెరో వికెట్ తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు.