Jagan: పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అక్కడ 100 అడుగుల వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటు చేస్తాం: జగన్

  • పోలవరం ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేస్తాం
  • యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును నిర్మిస్తాం
  • వైయస్ ఆశయాలకు అనుగుణంగా 45.72 మీటర్ల ఎత్తు నిర్మిస్తాం
Will set up 100 ft YSR statue at Polavaram project says Jagan

పోలవరం ప్రాజెక్టుపై ఈరోజు అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ప్రభుత్వ తీరు వల్ల పోలవరం ప్రాజెక్టుకు ఇబ్బందులు కలుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమని చెప్పారు. డ్యామ్ ఎత్తును ఒక్క అంగుళం కూడా తగ్గంచబోమని స్పష్టం చేశారు.

దివంగత వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా 45.72 మీటర్ల ఎత్తు నిర్మిస్తామని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని తెలిపారు. నిర్ణీత సమయానికి పోలవరంను పూర్తి చేసి, అక్కడ 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

మరోవైపు గత టీడీపీ ప్రభుత్వంపైనా, చంద్రబాబుపైనా జగన్ విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శన పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. చంద్రన్న భజన కోసం ఏకంగా రూ. 83 కోట్లను ఖర్చు చేశారని విమర్శించారు.

ఇదే సమయంలో గతంలో పోలవరం సందర్శనకు వచ్చిన టీడీపీ మహిళా కార్యకర్తలు చంద్రబాబును పొగుడుతూ భజన పాట పాడిన వీడియోను శాసనసభలో ప్లే చేశారు. ఈ వీడియో చూస్తూ జగన్ పడిపడి నవ్వారు. అనంతరం జగన్ మాట్లాడుతూ ప్రజల సొమ్ముతో చంద్రబాబు భజన చేయించుకున్నారని చెప్పారు. స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ, 'అప్పట్లో ఇన్ని నేరాలు, ఘోరాలు జరిగాయన్నమాట' అని కామెంట్ చేశారు.

More Telugu News