సీఎం జగన్ మాట్లాడుతుంటే అడ్డుపడుతున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

02-12-2020 Wed 16:43
  • వరుసగా మూడో రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
  • 9 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్
  • ఒక రోజు పాటు సస్పెన్షన్ వేటు వేసిన స్పీకర్
TDP MLAs suspended from Assembly

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. మూడో రోజు సమావేశాల్లో కూడా కొందరు టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. ఈరోజు శాసనసభలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారని అధికారపక్ష ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం వద్ద టీడీపీ శాసనసభ్యులు ఆందోళన చేపడుతున్నారంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. సభకు ఆటంకం కలిగిస్తున్న 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

దీంతో 9 మంది ఎమ్మల్యేలను ఒక్క రోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సస్పెన్షన్ కు గురైన వారిలో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, డోల బాలవీరాంజనేయ స్వామి, బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు ఉన్నారు.