ప్రభాస్ కొత్త చిత్రం 'సలార్'.. అధికారికంగా వెలువడిన ప్రకటన

02-12-2020 Wed 15:24
  • 'సలార్'ను తెరకెక్కించనున్న 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్
  • విజయ్ కిరగందూర్ నిర్మాణ సారథ్యంలో కొత్త చిత్రం
  • భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే ఓకే చెపుతున్న ప్రభాస్
Prabhas next movie officially announced

'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి, తెలుగు సినిమా పవర్ ను దేశవ్యాప్తంగా చాటి చెప్పిన ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ కేవలం భారీ బడ్జెట్ చిత్రాలకు మాత్రమే ఓకే చెపుతున్నాడు.

ఆమధ్య వచ్చిన 'సాహో' చిత్రం కొంత నిరాశ పరిచినప్పటికీ ప్రభాస్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. నార్త్ లో సైతం ప్రభాస్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం 'రాధే శ్యామ్'లో నటిస్తున్న ప్రభాస్.. త్వరలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించనున్న 'ఆదిపురుష్'లో ప్రభాస్ నటించబోతున్నాడు. ఈ చిత్రంలో పలువురు బాలీవుడ్ స్టార్లు నటించనున్నారు. మరోవైపు, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా రెడీ గా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ చేయబోతున్న మరో సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడింది.

'కేజీఎఫ్' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ తరుపరి ప్రాజెక్టును చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కాసేపటి క్రితం వెలువడింది. 'సలార్' పేరుతో ఈ  చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రాన్ని హొంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించబోతున్నారు.

మాఫియా డాన్ కథతో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ కూడా పోస్టర్ కూడా దీనినే వివరిస్తోంది. అయితే 'ఆదిపురుష్' తర్వాత నాగ్ అశ్విన్ సినిమా తెరకెక్కుతుందా? లేక 'సలార్' సినిమా పట్టాలపైకి వస్తుందా? అనే విషయం తెలియాల్సి ఉంది.