ఏపీలో మరో దారుణం.. అమ్మాయిపై కత్తితో దాడి చేసి.. యువకుడి ఆత్మహత్యాయత్నం

02-12-2020 Wed 13:23
  • విశాఖ నగరంలో దారుణ ఘటన
  • ప్రియాంకపై శ్రీకాంత్ అనే యువకుడు కత్తిపోట్లు
  • మరో యువకుడితో చనువుగా ఉంటోందని దాడి
vizag girl attacked by lover

విజయవాడలో ఇటీవల ఇంజనీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజస్వినిపై నాగేంద్రబాబు (25) అలియాస్‌ చిన్నస్వామి అనే వ్యక్తి కత్తితో దారుణంగా దాడిచేసి, అనంతరం తానూ ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఇప్పుడు విశాఖలో ఇటువంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ప్రియాంక అనే యువతిపై శ్రీకాంత్ అనే యువకుడు కత్తితో దాడి చేసి, ఆత్మహత్యాయత్నం చేశాడు. డిగ్రీ చదువుతూ గ్రామ సచివాలయంలో వాలంటీరుగా పనిచేస్తున్న తన ప్రేమికురాలు ప్రియాంక మరో యువకుడితో చనువుగా వుంటోందన్న అనుమానంతోనే శ్రీకాంత్ దాడి చేసినట్టుగా తెలిసింది.

దాడి అనంతరం స్వయంగా ప్రియాంక ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులతో శ్రీకాంత్ ఈ విషయం చెప్పాడు. వారితో మాట్లాడుతోన్న సమయంలోనే అదే కత్తితో తనను తాను గాయపరచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఫెర్రీ రోడ్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. ప్రియాంక గొంతుపై తీవ్ర గాయాలు కాగా ఆమెను కూడా కొందరు ఆసుపత్రికి తరలించారు.