కథానాయికల మల్టీస్టారర్.. ఓ హీరోయిన్ గా కాజల్!

02-12-2020 Wed 12:24
  • నలుగురు కథానాయికలతో మల్టీ స్టారర్ 
  • హారర్ కథాంశంతో సాగే తమిళ సినిమా
  • కాజల్ కి ఇటీవలే చెన్నైలో లుక్ టెస్ట్ 
  • మరో ముగ్గురు నాయికల ఎంపిక  
Kajal In a heroine multi starer

మామూలుగా స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ చిత్రాలు నిర్మిస్తుంటారు. అయితే, ఇందుకు భిన్నంగా ఇప్పుడు స్టార్ హీరోయిన్లతో తమిళంలో ఓ మల్టీ స్టారర్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి దర్శకుడు డీకే దర్శకత్వం వహించనున్నాడు.

ఇందులో ఓ కథానాయికగా ఇప్పటికే కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు డీకే సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ చిత్రకథ వినడానికి కాజల్ ఇటీవల చెన్నై కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడే ఆమెకు లుక్ టెస్ట్ కూడా జరిగిందట. గతంలో కాజల్ ఈ దర్శకుడితో 'కావలై వేండమ్' అనే చిత్రంలో నటించింది.

ఇక ఈ చిత్రం హారర్ కథాంశంతో రూపొందుతుంది. ఇందులో మొత్తం నలుగురు కథానాయికలు నటిస్తారు. కాజల్ ఎంపిక పూర్తయింది కాబట్టి, మరో ముగ్గురు అగ్ర కథానాయికల ఎంపిక జరుగుతోంది. మరోపక్క ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి.