ఓల్డ్ మలక్ పేట్ తప్ప అన్ని డివిజన్లలో ముగిసిన జీహెచ్ఎంసీ పోలింగ్

01-12-2020 Tue 18:41
  • 149 డివిజన్లకు జరిగిన పోలింగ్
  • ఓల్డ్ మలక్ పేటలో రేపు రీపోలింగ్
  • అనేక డివిజన్లలో 15 శాతం కూడా దాటని పోలింగ్
GHMC polling comes to an end except Old Malakpet division

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకు గాను 149 డివిజన్లలో పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఓల్డ్ మలక్ పేట్ డివిజన్ లో రేపు రీపోలింగ్ జరుపనున్నారు. గుర్తులు తారుమారు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు డిసెంబరు 4న వెల్లడిస్తారు.

ఇవాళ జరిగిన పోలింగ్ చాలావరకు మందకొడిగా సాగింది. వరుస సెలవులు, కరోనా భయాలు, వర్క్ ఫ్రం హోం వంటి అంశాలతో చాలామంది టెక్కీలు పోలింగ్ కేంద్రాలకు రాలేదని భావిస్తున్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలతో పోల్చితే శివారు ప్రాంతాల్లోనే మెరుగైన స్థాయిలో పోలింగ్ జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 36.73 శాతం పోలింగ్ జరిగినట్టు తెలిపారు. పలు డివిజన్లలో కనీసం 15 శాతం ఓటింగ్ కూడా జరగకపోవడంతో ఫలితాలపై ఆసక్తి మరింత అధికమైంది.

కాగా, ఓల్డ్ మలక్ పేట్ లో రీపోలింగ్ నిర్వహించాల్సి ఉన్నందున రేపు సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.