సూర్యాపేట జిల్లాలో విషాదం... కోతుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన యువతి

01-12-2020 Tue 17:19
  • కుక్కడం గ్రామంలో ఘటన
  • ఇంట్లోకి వచ్చిన కోతులు
  • తరిమేందుకు ప్రయత్నించిన యువతి
Woman dies of monkeys attack in Suryapet district

జనావాస ప్రాంతాల్లో కోతులు ఓ బెడదలా పరిణమిస్తుంటాయి. ఒక్కోసారి కోతులు మనుషులపైనా దాడికి దిగుతుంటాయి. సూర్యాపేట జిల్లాలోనూ అదే జరిగింది. కోతులు ఒక్కదుటున ఎగబడడంతో ఓ వివాహిత కిందపడి తలకు దెబ్బతగలడంతో ప్రాణాలు కోల్పోయింది. జిల్లాలోని కుక్కడం గ్రామంలో ఈ ఈ విషాద ఘటన జరిగింది. ఇంట్లోకి కోతులు వస్తుండడంతో దోమల శ్రీలత (23) అనే యువతి వాటిని తరిమేందుకు ప్రయత్నించింది.

ఈ క్రమంలో కొన్ని కోతులు శ్రీలతపైకి దూకాయి. దాంతో భయపడిపోయిన శ్రీలత కోతుల నుంచి తప్పించుకునే క్రమంలో కిందపడింది. ఆమె తల గడపకు తగలడంతో ఘటన స్థలంలోనే మరణించింది. శ్రీలతకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. తల్లిని కోల్పోయిన ఆ పిల్లల పరిస్థితి చూపరులను కలచివేస్తోంది.