తమిళ స్టార్ హీరో సినిమాలో రాశిఖన్నా

01-12-2020 Tue 16:15
  • వచ్చి ఐదేళ్లయినా రేంజ్ పెరగని రాశీఖన్నా 
  • తమిళ సినిమాలో విక్రమ్ సరసన ఆఫర్
  • హరి దర్శకత్వంలో భారీ యాక్షన్ సినిమా 
  • విక్రమ్-హరి కలయికలో మూడో చిత్రం   
Rashikhanna opposite Vikram in a Tamil movie

అందం, అభినయం వున్నప్పటికీ ఎందుకనో కొంతమందికి సరైన అవకాశాలు రావు. కథానాయిక రాశిఖన్నా పరిస్థితి కూడా అటువంటిదే. తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించి ఐదేళ్లయినా, ఈ ముద్దుగుమ్మ కథానాయికగా దూసుకుపోయింది లేదు. ఏవో సినిమాలు చేస్తోంది కానీ, ఆమె రేంజ్ మాత్రం పెరగడం లేదు. ఇటీవలి కాలంలో 'వెంకీమామ', 'ప్రతి రోజు పండగే' వంటి హిట్ సినిమాలలో నటించినప్పటికీ ఈ భామకు టాలీవుడ్ నుంచి అంతగా ఆఫర్లు లేవనే చెప్పాలి.

అయితే, తమిళంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఆమె బిజీగా వుంది. ప్రస్తుతం అక్కడ మూడు నాలుగు సినిమాలలో నటిస్తూ మంచి ఫామ్ లో వుంది. ఈ క్రమంలో స్టార్ హీరో విక్రమ్ సరసన కథానాయికగా నటించే ఛాన్స్ ఈ ముద్దుగుమ్మకు వచ్చినట్టు తెలుస్తోంది.

భారీ యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి దర్శకత్వంలో స్టార్ హీరో విక్రమ్ ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో రాశీఖన్నాను హీరోయిన్ గా ఎంచుకున్నట్టు తాజా సమాచారం. విక్రమ్-హరి కలయికలో ఇది మూడో సినిమా. గతంలో వీరిద్దరి కాంబినేషన్లోనూ   సామి, సామి స్క్వేర్ చిత్రాలు వచ్చాయి.