GHMC Elections: మధ్యాహ్నం 3 గంటల వరకు 25 శాతం పోలింగ్... గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ తగ్గడానికి కారణాలు చెప్పిన ఎస్ఈసీ

  • నేడు జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్
  • నత్తనడకన సాగుతున్న ఓటింగ్
  • మధ్యాహ్నం నుంచి పోలింగ్ శాతం పెరగొచ్చంటున్న ఎస్ఈసీ
SEC clarifies why voting has been slow down in GHMC Elections

బల్దియా ఎన్నికల పోలింగ్ అత్యంత నిదానంగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 25.34 శాతం ఓటింగ్ నమోదు కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న ఈ పోలింగ్ లో ఈసారి ఐటీ ఉద్యోగుల సందడి పెద్దగా కనిపించలేదు. ప్రతి ఒక్కరూ ఓటేయాలని విస్తృతంగా ప్రచారం జరిగినా ఆశించిన మేర ఓటింగ్ నమోదు కాలేదు.

దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి పార్థసారథి స్పందించారు. కరోనా వ్యాప్తి వల్ల కొంతమేర ఓటింగ్ తగ్గిందని, చలి వాతావరణం కూడా ఉదయం పూట ఓటర్లకు ప్రతిబంధకంగా మారిందని అన్నారు. గతంలో కరోనా లేనందువల్ల మధ్యాహ్నం 12 గంటల సమయానికే భారీగా పోలింగ్ జరిగేదని, ఈసారి మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ శాతం పుంజుకుంటుందని భావిస్తున్నామని చెప్పారు.

ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికల్లో ఆందోళనకర స్థాయిలో గొడవలు ఏమీలేవని, పోలీసులు అప్రమత్తంగానే ఉన్నారని పార్థసారథి వెల్లడించారు. కాగా, నగరంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు రాకపోవడంతో, సిబ్బంది పనిలేక కునుకు తీస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు దర్శనమిస్తున్నాయి.

More Telugu News