కేసీఆర్ ఆదేశాలతోనే బండి సంజయ్ పై దాడి చేశారు: వివేక్

01-12-2020 Tue 15:11
  • హైదరాబాదులో నిన్న బండి సంజయ్ పై దాడి 
  • దాడిని ఖండిస్తున్నామంటూ వివేక్ ప్రకటన
  • కేసీఆర్ కు రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యలు
Vivek condemns attack on Bandi Sanjay

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై హైదరాబాదులో గత రాత్రి దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ నేత, జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ కమిటీ జాయింట్ కన్వీనర్ వివేక్ స్పందించారు. కేసీఆర్ ఆదేశాలతోనే బండి సంజయ్ పై దాడి జరిగిందని ఆరోపించారు. ఈ దాడిని ఖండిస్తున్నామని అన్నారు. జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడికి కనీస భద్రత కల్పించడంలేదని విమర్శించారు.

కేసీఆర్ కు రోజులు దగ్గరపడ్డాయని, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని వివేక్ స్పష్టం చేశారు. దుబ్బాక అసెంబ్లీ స్థానం బీజేపీ వశం కావడంతో జీహెచ్ఎంసీలోనూ బీజేపీనే గెలుస్తుందని కేసీఆర్ కు ఆందోళన కలుగుతోందని అన్నారు. ప్రజల్లో తండ్రీకొడుకులపై తీవ్ర వ్యతిరేకత రావడంతో డబ్బులు పంచి అయినా గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు.