తదుపరి ఎన్నికల్లో టీడీపీకి రెండు మూడు సీట్లు కూడా దక్కవు: వైఎస్ జగన్ ఆగ్రహం

01-12-2020 Tue 12:17
  • సభకు అంతరాయం కలిగించడం పరిపాటిగా మారింది
  • అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారో కూడా తెలియడం లేదు
  • ప్రజలు గమనిస్తున్నారన్న వైఎస్ జగన్
Jagan says TDP Cant Even Get 3 Assembly Seats in Next Elections

తెలుగుదేశం పార్టీ తన పద్ధతిని మార్చుకోకుంటే, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి రెండు, మూడు అసెంబ్లీ సీట్లు కూడా దక్కబోవని ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సభకు పదేపదే అంతరాయం కలిగించడం ఆ పార్టీ నాయకులకు పరిపాటిగా మారిందని, కనీస చర్చల్లోనూ పాల్గొనకుండా ఉండాలన్న ఉద్దేశంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు అసలు సభకు ఎందుకు వస్తున్నారో కూడా తెలియడం లేదని అన్నారు. అనవసరమైన అంశాలపై వారు చేస్తున్న రాద్ధాంతాన్ని ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని జగన్ మండిపడ్డారు.

ప్రభుత్వం చేసే మంచి పనుల ఆధారంగానే క్రెడిబులిటీ వస్తుందని వ్యాఖ్యానించిన జగన్, చంద్రబాబు తన క్రెడిబులిటీని కోల్పోవడంతోనే ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నారని, ఇదే పద్ధతిని కొనసాగిస్తే, ఆ స్థానం కూడా మిగలదని హెచ్చరించారు. ఈ నెల 15వ తేదీన రైతుల బీమా కోసం రూ. 1,227 కోట్లను ప్రీమియం రూపంలో ప్రభుత్వం స్వయంగా చెల్లించనుందని జగన్ స్పష్టం చేశారు.

ఇదిలావుండగా, టీడీపీ సభ్యులు సభా కార్యక్రమాలకు పదేపదే ఆటంకాలు కల్పిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం, పదే పదే వాగ్వాదానికి దిగుతున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.