శ్రీవారిని దర్శించుకున్న గంటా శ్రీనివాసరావు.. అసెంబ్లీ సమావేశాల తీరుపై విమర్శలు

01-12-2020 Tue 11:47
  • నిన్నటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి
  • సమస్యలు పరిష్కరించే దిశగా చర్చలు జరిగే వేదికగా అసెంబ్లీ ఉండాలి
  • అధికార, ప్రతిపక్షం సంయమనం పాటించాలి
  • సమయం కూడా తక్కువగా ఉంది
ganta slams tdp ycp

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతోన్న తీరుపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్నటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ అనేది ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా చర్చలు జరిగే వేదికగా ఉండాలి. అధికార, ప్రతిపక్షం సంయమనం పాటించాలి’ అని చెప్పుకొచ్చారు.

‘సమయం కూడా తక్కువగా ఉంది. ఐదు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. అనేక బిల్లులు అసెంబ్లీలో పెడుతున్నారు. అర్థవంతంగా వాటిపై చర్చలు జరగాలి. అసెంబ్లీలో అనుభవం ఉన్న ప్రతిపక్ష నాయుకుడు ఉన్నారు. అలాగే, ప్రజలకు ఏదో చేయాలన్న అధికార పక్ష నాయకుడు ఉన్నారు. ఇరు పక్షాలు సంయమనం పాటిస్తూ సభను కొనసాగించాలి. అసెంబ్లీలో నిన్న జరిగిన ఘటనలు మళ్లీ రిపీట్ కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను’ అని గంటా శ్రీనివాసరావు అన్నారు.