ఓల్డ్ మలక్ పేట అంతటా నిలిచిన పోలింగ్... రేపు రీపోలింగ్!

01-12-2020 Tue 11:42
  • అభ్యర్థి గుర్తు తప్పుగా ముద్రణ
  • సీపీఐ అభ్యర్థికి సీపీఎం గుర్తు
  • ఫిర్యాదు చేయడంతో పోలింగ్ నిలిపివేత
Poling Stopped in Old Malakpet Devision

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మందకొడిగా సాగుతున్న వేళ, ఓల్డ్ మలక్ పేట డివిజన్ లోని 69 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలిచిపోయింది. కంకి కొడవలి గుర్తుకు బదులుగా సుత్తి కొడవలి గుర్తు బ్యాలెట్ పేపర్ పై ముద్రితమైంది. సీపీఐ తరఫున ఈ డివిజన్ నుంచి పోటీ పడుతున్న ఫాతిమా, తన పేరు పక్కన సీపీఎం గుర్తును చూసి అవాక్కై, విషయాన్ని రిటర్నింగ్ అధికారులకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఎన్నికలు జరపాల్సిందేనని ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీల నేతలు గొడవకు దిగినప్పటికీ, ఎన్నికల సంఘం మాత్రం జరిగిన తప్పుపై స్పందిస్తూ, డివిజన్ మొత్తం పోలింగ్ ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. వీలైతే రేపే ఇక్కడ రీపోలింగ్ ను జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా, గుర్తులు మారిపోయిన విషయం దాదాపు 5 శాతం పోలింగ్ జరిగిన తరువాత వెలుగులోకి రావడం గమనార్హం. ఈసీ నుంచి ఆదేశాలు రాగానే, పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సిబ్బంది తమ సరంజామాను తీసుకుని వెళ్లిపోయారు.