నటి పవిత్ర పునియా నా భార్య... రహస్యంగా ఉంచాలని కోరి ఇప్పుడు మోసం చేస్తోందన్న వ్యాపారవేత్త!

01-12-2020 Tue 10:20
  • తమకు పెళ్లయిందన్న సుమిత్ మహేశ్వరి
  • ఇప్పుడు పరాస్ ఛబ్రాతో తిరుగుతోందని ఆరోపణ
  • తనకు జరిగిన నిశ్చితార్థం క్యాన్సిల్ అయిందన్న పవిత్ర
Sumit Maheshwari Alligations on Actress Pavitra Puniya

బాలీవుడ్ బుల్లి తెరపై ఎన్నో పాప్యులర్ సీరియళ్లలో నటించిన పవిత్ర పునియా తన భార్యని, దాన్ని ఆమే రహస్యంగా ఉంచాలని కోరగా, తాను ఎవరికీ చెప్పలేదని, ఇప్పుడు మరో నటుడు పరాస్ ఛబ్రాతో తిరుగుతూ అతన్ని కూడా మోసం చేస్తోందని వ్యాపారవేత్త, హోటల్ యజమాని సుమిత్ మహేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు. తామిద్దరమూ ఇప్పటికీ భార్యాభర్తలమేనని, తమకు ఎంగేజ్ మెంట్, వివాహం జరిగాయని, నా భార్యగా ఉంటూ పరాస్ తో తిరగడంతో తాను మనస్తాపం చెందానని ఆయన అన్నారు.

తామిద్దరికీ విడాకులు వచ్చేంత వరకూ ఆగాలని పరాస్ ను కోరానని, ఇప్పటికీ తన చేతిపై పవిత్ర పేరు టాటూ రూపంలో ఉందని అన్నారు. ఆమె పూర్తిగా మారిపోయినా, తనలో మాత్రం మార్పు లేదని తెలిపారు. తమ వివాహ వార్షికోత్సవం గోవాలో జరుపుకుంటున్న వేళ, పరాస్ రాగా, అతనితో పవిత్ర వెళ్లడం చూసి చాలా బాధపడ్డానని, ఆమె ప్రేమలో నిజాయతీ లేకపోయిందని వాపోయారు.

కాగా, ఈ విషయంలో పవిత్ర వాదన మరోలా ఉండటం గమనార్హం. ఇటీవల మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు నిశ్చితార్థం జరిగిందని, కానీ దాన్ని క్యాన్సిల్ చేసుకున్నామని మాత్రం చెప్పారు. అది ఎవరితోనన్న విషయాన్ని కూడా ప్రస్తావించలేదు.

ఇక ఇదే విషయంలో పరాస్ స్పందిస్తూ, పవిత్ర భర్త నుంచి తనకు మెసేజ్ వచ్చిందని, దాని గురించి ప్రశ్నిస్తే, ఆమె నిజమేనని అంగీకరించిందని అన్నారు. ఆపై పవిత్ర గురించి మరో సంచలన విషయం తనకు తెలిసిందని, దాన్ని బయటపెట్టాలని మాత్రం భావించడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.