కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి సినిమా!

01-12-2020 Tue 10:14
  • గతంలో కోల్ కతా నేపథ్యంలో 'చూడాలని ఉంది'
  • 'వేదాళం' రీమేక్ లో కూడా ఆ నగర బ్యాక్ డ్రాప్
  • ఇటీవలి దసరా ఉత్సవాల దృశ్యాల చిత్రీకరణ  
  • కొన్ని సన్నివేశాలలో చిరంజీవి గుండు గెటప్  
Chiranjeevis next film will be in Kolkata backdrop

గతంలో చిరంజీవి నటించిన 'చూడాలని ఉంది' సినిమాలో కోల్ కతా నగర నేపథ్యం కనిపిస్తుంది. అందులో ఆ నగరం విశిష్టతను తెలుపుతూ చిరంజీవిపై ఏకంగా ఓ పాట కూడా ఉంటుంది. ఇప్పుడు మళ్లీ చిరంజీవి అలాంటి కోల్ కతా నేపథ్యంలో మరో సినిమా చేస్తుండడం విశేషం.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న 'ఆచార్య' సినిమా తర్వాత చిరంజీవి తమిళ సినిమా 'వేదాళం' రీమేక్ లో నటించనున్నారు. దీనికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి.

ఈ చిత్రంలో కోల్ కతా నగర నేపథ్యం వుంటుందట. చిత్రం షూటింగులో కొంత భాగాన్ని అక్కడ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో దసరా ఉత్సవాల సన్నివేశాలు కూడా సినిమాలో ఉండడంతో, ఇటీవల ఆ పండగ సమయంలో యూనిట్ అక్కడికి వెళ్లి సంబంధిత ఉత్సవ సన్నివేశాలను కొన్నింటిని చిత్రీకరించుకుని వచ్చినట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో చిరంజీవి కొన్ని సన్నివేశాలలో గుండుతో కనిపిస్తారట. అందుకోసమే ఆమధ్య గుండు గెటప్ తో మేకప్ టెస్టులు కూడా జరిగాయి. ఆ ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు కూడా.