Indian Navy: విశాఖ సమీపంలో 27 కిలోమీటర్ల తీరాన్ని నేవీకి ఇవ్వాలని ఏపీ సర్కారు నిర్ణయం!

  • ప్రత్యామ్నాయ నిర్వహణా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న నేవీ
  • అధికారుల చర్చల తరువాత నిర్ణయం
  • రాంబిల్లి ప్రతిపాదిత పోర్టును ఆనుకుని నౌకాదళ తీరం
  • బాలిస్టిక్ మిసైల్ షిప్ లు, సబ్ మెరైన్లను దాచనున్న నేవీ
Andhra to give Vizag coastline to the Navy

విశాఖపట్నం శివార్లలోని నక్కపల్లి సమీపంలో 27 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని భారత నౌకాదళానికి ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ ప్రాంతంలో భారత నేవీ ప్రత్యామ్నాయ నిర్వహణా కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ తీరాన్ని తమకు ఇవ్వాలని చానాళ్ల క్రితమే నేవీ అధికారులు, ప్రభుత్వాన్ని సంప్రదించగా, ఏపీ మేరీటైమ్ బోర్డు, ఇతర విభాగాల అధికారులు చర్చలు జరిపిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇందులో భాగంగా మొత్తం 97 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని నోటిఫై చేయాల్సి వుంటుంది. రాంబిల్లి ప్రతిపాదిత పోర్టును ఆనుకుని నౌకా దళ తీర పరిధి ప్రారంభమవుతుంది. రాంబిల్లి పోర్టు పరిధిని గుర్తించాలని విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈస్ట్రన్ నావెల్ కమాండ్, చంద్రబాబు ప్రభుత్వం కొనసాగుతున్న రోజుల్లోనే... అంటే 2016లో సర్కారును కోరింది. అప్పటి నుంచి అధికారుల మధ్య చర్చలు జరుగుతుండగా, ఇటీవల నేవీ చీఫ్ ప్రత్యేకంగా వచ్చి, ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపారు.

ఇక ఇక్కడ నేవీ తలపెట్టిన ప్రత్యామ్నాయ నిర్వహణా కేంద్రంలో 12 న్యూక్లియర్ పవర్ బాలిస్టిక్ మిసైల్ షిప్ లు, సబ్ మెరైన్లను ఉంచి వాటిని నిర్వహిస్తారు. ఇదే ప్రాంతంలో సబ్ మెరైన్లను దాచే బంకర్లను కూడా నిర్మించడం ద్వారా వాటిని శత్రు క్షిపణుల నుంచి రక్షించేందుకు అనువైన ప్రాంతాలున్నాయని నేవీ అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఈ నేవీ కేంద్రాన్ని ప్రభుత్వం సైతం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులను ఇప్పటికే రూ.10 వేల కోట్లతో నిర్మించాలని నిర్ణయం తీసుకున్న జగన్ సర్కారు, నేవీ కేంద్రానికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది.

ఇదిలావుండగా, ఏపీ తీరంలో నౌకల రీసైక్లింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. 1995-96లో కాకినాడ సమీపంలో ఐదు నౌకలను రీసైకిల్ చేసిన తరువాత, ఏపీ తీరంలో నౌకలను మళ్లీ రీసైకిల్ చేయలేదు. ఇప్పుడు రీసైక్లింగ్ యూనిట్ కు ఎన్నో తీర జిల్లాలు అనుకూలంగా ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల పరిధిలోని తీరంలో ఎక్కడో ఒకచోట ఈ  కేంద్రాలు సమీప భవిష్యత్తులో ఏర్పాటవుతాయని తెలుస్తోంది.

More Telugu News