GHMC Elections: ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు వీరే

  • జోరుగా కొనసాగుతున్న పోలింగ్
  • ఓటుహక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ, పోలీసు ప్రముఖులు
  • జూబ్లీహిల్స్‌లో ఓటుహక్కు వినియోగించుకున్న చిరంజీవి దంపతులు
cine  political and police officers cast their vote

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఈ ఉదయం ప్రారంభమైన పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. చాలాచోట్ల పెద్ద ఎత్తున క్యూలు కనిపించాయి. పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పటాన్‌చెరు డివిజన్‌లోని పోలింగ్ కేంద్రం-19లో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

శాస్త్రిపురంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, బోరబండ సైట్‌వన్ పోలింగ్ కేంద్రంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఓటు వేశారు. చిక్కడపల్లి పోలింగ్ కేంద్రంలో బీజేపీ నేత, బీజేవైఎం ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ నాంపల్లిలోని వ్యాయామశాల హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోగా, కుందన్‌బాగ్ చిన్మయి స్కూల్‌లో రాచకొండ సీపీ మహేశ్ భగవత్, అంబర్‌పేట ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఓటు వేశారు. కుందన్‌బాగ్ పోలింగ్ కేంద్రంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ఓటు వేశారు.

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి దంపతులు కాచిగూడ దీక్షా మోడల్ స్కూల్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో మంత్రి కేటీఆర్ ఓటు వేశారు. అలాగే, పలువురు సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫిల్మ్‌నగర్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో నిర్మాత శ్యామ్ ప్రసాద్‌రెడ్డి, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఓటువేశారు. జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రంలో ప్రముఖ నటుడు చిరంజీవి దంపతులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

More Telugu News