Hyderabad: మరికాసేపట్లో జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

GHMC Election polling starts at 7am today
  • 150 డివిజన్ల బరిలో 1,122 మంది అభ్యర్థులు
  • ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్
  • వృద్ధులు, కరోనా రోగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న 74,44,260 మంది ఓటర్లు
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది. ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి. పార్థసారధి తెలిపారు.

రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్ల తర్వాత ఓ ఉప ఎన్నికలో తొలిసారి ఓడిపోయిన అధికార టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అలాగే, దుబ్బాక విజయంతో జోష్ మీదున్న బీజేపీ కూడా వీలైనన్ని స్థానాలను గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్‌, టీడీపీ, ఎంఐఎంలు కూడా పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లోనూ ఈవీఎంలను ఉపయోగించగా, ఈసారి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఓటరు గుర్తింపు కార్డు లేనివారు ఎన్నికల సంఘం పేర్కొన్న 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదానిని వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు ఉంటేనే ఓటు వేయనిస్తారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్ సిబ్బందితోపాటు ఓటర్లు కూడా తప్పకుండా మాస్క్ ధరించాల్సిందేనని అధికారులు ఆదేశించారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంది. కరోనా బాధితులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  

నగరంలో మొత్తం 150 డివిజన్‌లు ఉండగా, వివిధ పార్టీలకు చెందిన మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జంగంమెట్‌లో అత్యధికంగా 20 మంది పోటీలో ఉండగా, ఉప్పల్, బార్కస్‌, నవాబ్‌సాహెబ్‌కుంట, టోలిచౌకి, జీడిమెట్లలో అత్యల్పంగా ముగ్గురేసి చొప్పున బరిలోకి దిగారు. మొత్తం  9,101 కేంద్రాలను ఏర్పాటు చేయగా, కొండాపూర్‌లో అత్యధికంగా 99 కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 74,44,260 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Hyderabad
GHMC Elections
Polling
State Election Commission

More Telugu News