ఎన్డీయే నుంచి బయటకు వస్తామంటూ అమిత్ షాను హెచ్చరించిన ఆర్ఎల్పీ

30-11-2020 Mon 20:14
  • ఎన్డీయేలో దుమారం రేపుతున్న కొత్త వ్యవసాయ చట్టాలు
  • వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన ఆర్ఎల్పీ
  • లేకపోతే ఎన్డీయేలో కొనసాగడంపై పునరాలోచిస్తామని వార్నింగ్
RLP threatens to quit NDA over farm laws

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు ఎన్డీయేలో దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే వీటిని వ్యతిరేకిస్తూ ఎన్డీయే నుంచి అకాళీదల్ బయటకు వచ్చింది. తాజాగా మరో భాగస్వామి బయటకు వచ్చేస్తామని హెచ్చరించింది. వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశిస్తూ ఆర్ఎల్పీ అధినేత హనుమాన్ బేనీవాల్ ట్వీట్ చేశారు.

'మిస్టర్ అమిత్ షా, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకు మద్దతు పలుకుతున్నాం. ఈ మూడు చట్టాలను వెంటనే ఉపసంహరించుకోండి. స్వామినాథన్ కమిషన్ సూచనలను అమలు చేయండి. ఢిల్లీలో నిరసన చేపట్టిన రైతులతో వెంటనే చర్చలు జరపండి. ఆర్ఎల్పీ అనేది ఎన్డీయేలో ఒక భాగస్వామి. కానీ, రైతులు, జవాన్ల వల్లే మనకు అధికారం దక్కింది. ఈ అంశానికి సంబంధించి వెంటనే సరైన చర్యలు తీసుకోకపోతే... ఎన్డీయేలో కొనసాగడంపై నేను పునరాలోచించుకోవాల్సి వస్తుంది' అని బేనీవాల్ ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై అమిత్ షా ఇంకా స్పందించాల్సి ఉంది.